డీఎంకే ఎమ్మెల్యేల మాక్‌అసెంబ్లీ

12

– సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌

చెన్నై,ఆగస్టు 19(జనంసాక్షి): తమిళనాడు అసెంబ్లీలో సస్పెన్షన్‌కు గురైన డీఎంకే సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు.  అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీ సభ్యులు శుక్రవారం చెన్నైలోని అసెంబ్లీ సవిూపంలో ఆందోళనకు దిగారు. సభ్యులంతా ఒక చోట చేరి అసెంబ్లీ సమావేశాల తరహాలో మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. పార్టీ సభ్యుడు దురైమురగన్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రుల స్థానంలో కూర్చున్న వారు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా డీఎంకే నేత స్టాలిన్‌ మాట్లాడుతూ.. సస్పెన్షన్‌పై తాము మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. డీఎంకే ఎమ్మెల్యే దురైమురగన్‌ మాట్లాడుతూ.. సమావేశాలు ఎలా నిర్వహించాలో తెలిపేందుకే ఈ మాక్‌ అసెంబ్లీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని, ముఖ్యమంత్రి జయలలితపై తీవ్ర విమర్శలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిని సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.కాగా, ఆందోళన చేస్తున్న డీఎంకే సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే తమిళనాడు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన వారి విషయంపై శుక్రవారం స్పీకర్‌ పి. ధనపాల్‌ స్పందించారు. సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలంటూ డీఎంకే సభ్యులు పెట్టిన పిటిషన్‌ను స్పీకర్‌ మరోసారి తిరస్కరించారు.  ఆరోజు చాలా సహనంగా వ్యవహరించానని కాని.. వారిపై కఠినంగా చర్యలు తీసుకోక తప్పలేదని ధనపాల్‌ వివరించారు. గురువారం వారి పిటిషన్‌ను తిరస్కరించిన స్పీకర్‌ శుక్రవారం మరోసారి సస్పెన్షన్‌ను ఉపసంహరించుకునేది లేదని స్పష్టంచేశారు. డీఎంకే నేత స్టాలిన్‌, డిప్యూటీ నేత దురయ్‌ మురుగన్‌ల ఆధ్వర్యంలో సస్పెండైన డీఎంకే సభ్యులు శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మాక్‌ అసెంబ్లీ నిర్వహించి అనంతరం ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని అప్పుడే అక్కడ జరుగుతున్న తప్పులు అందరికీ తెలుస్తాయని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.