డెల్టాను కాపాడుకుందాం రండి : సిపిఎం

ఏలూరు,మే11(జ‌నం సాక్షి ): రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగుకు అధికారులు అనుమతి ఇస్తున్నారని సీపీఎం డెల్టా కార్యదర్శి బి.బలరాం ఆరోపించారు.  అక్రమ ఆక్వా సాగు వల్ల డెల్టా నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలు చక్కగా పండే పొలాలను సైతం పనికి రాకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. డెల్టాలోని పంట భూములను కాలుష్యం నుంచి కాపాడాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మే 12 నుంచి 20 వరకు ‘పంట చేలు పరిరక్షణ యాత్ర’ నిర్వహిస్తున్నట్లు వివరించారు. మే 21న ఉప కలెక్టర్‌ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మికులు, 
మత్స్యకారులు, రైతులు, కౌలు రైతులు, ప్రజలతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేయనున్నట్లు తెలిపారు. డెల్టాను కాపాడుకోవాల్సి ఉందన్నారు. లేకుంటే ఇక్కడి పచ్చని పొలాలు కాలుష్య కాసారాలుగా మారగలవన్నారు. ఇప్పటికే చేపల చెరువుల, ఆక్వా చెరువులతో సర్వ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి కలసి రావాలని ఆయన రైతులను కోరారు.

తాజావార్తలు