తల, తోక లేని పరిపాలన వల్ల నీటి సమస్య: జగన్‌

img_910864పులివెందుల : తల, తోక లేని పరిపాలన వల్ల రాష్ట్రంలో నీటి సమస్య ఉందని, తొమ్మిదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, ఎన్నికల ముందు వచ్చి ప్రాజెక్టుల ముందు కొబ్బరికాయలు కొట్టడమే తప్ప, ఆ తర్వాత డబ్బులిచ్చే కార్యక్రమం ఎప్పుడూ చేయలేదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం కడప జిల్లా పులివెందులలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట జరుగుతున్న రైతుల మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు నీటి విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్‌ పనుల్ని పూర్తిచేస్తే జిల్లా సస్యశ్యామల మయ్యేదని అన్నారు. తుంగశద్ర నీళ్లు పులివెందులకు ఏ మాత్రం సరిపోవన్నారు. పట్టిసీమ నీళ్లు రాయలసీమకు ఇస్తామన్నారని, నీటి విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, ఎందుకు ఇవ్వలేదో సీఎం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. పట్టిసీమపై ఖర్చు పెట్టిన డబ్బుతో పెండింగ్‌ పనుల్ని పూర్తి చేస్తే జిల్లా సస్యశ్యామలమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని, గండికోట, గాలేరి-నగరి ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే శ్రీశైలం నుంచి 22 వేల క్యూసెక్కుల నీరు వచ్చేదని జగన్‌ అన్నారు.

తాజావార్తలు