తాగునీటి పథకాలకు రూ.382కోట్లు మంజూరు

కర్నూలు,మే15(జ‌నం సాక్షి ): అమ్మిగనూరు పట్టణాల్లో ప్రజలు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పురపాలక సంఘాలకు నీటి పథకాలను మంజూరు చేసినట్లు ప్రజారోగ్యశాఖ ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలోని గుడికల్‌ రహదారిలో తాగునీటి పథకాల ఫిల్టర్‌బెడ్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి రూ.126 కోట్లు, గూడూరు మున్సిపాలిటీకి రూ.40కోట్లు, నందికొట్కూర్‌కు రూ.70కోట్లు, ఆత్మకూరుకు రూ.76కోట్లు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి రూ.70కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎస్‌ఈ తెలిపారు. ఇప్పటికే కొత్తగా నిర్మించే ఎస్‌ఎస్‌ ట్యాంకులు, పైపులైన్లు తదితరాలకు డీపీఆర్‌ తయారు చేసి ఉన్నతాధికారులకు పంపటం జరిగిందని వెల్లడించారు. ఈ నెల 28న అమరావతిలో ఏషియన్‌ బ్యాంకు యాజమాన్యం వీటికి నిధులు విడుదల చేస్తారని తెలిపారు. ఇప్పటికే జీవో విడుదల కావటంతో వచ్చే నెల 15లోపు ఈ పథకాలకు టెండర్‌ పిలుస్తారని వెల్లడించారు. సమావేశంలో పురపాలక ఛైర్‌పర్సన్‌ చాయా సరస్వతి, కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి, ఈఈ శేషశాయి, డీఈలు గురప్ప, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు