తాటాకు చప్పుళ్లకు భయపడను: సిఎం చంద్రబాబు

అనంతపురం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు భయపడనని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సంక్షేమం,అభివృద్ది విషయంలో వెనక్కి తగ్గేది లేదని కూడా అన్నారు. ఇంద్రావతి వద్ద జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొని హంద్రీనీవాను పరిశీలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లాలోని ఉరవకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని

ప్రసంగించారు. అనంతపురం జిల్లాను పండ్ల తోటల హబ్‌గా మారుస్తామన్నారు. అలాగే ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. 6వేలు ఇచ్చామన్నారు. త్వరలోనే మరో రూ. 4వేలు ఇస్తామన్నారు. 40వేల మంది బీసీ యువతులకు పెళ్లికానుక అందజేస్తామన్నారు. నీతివంతమైన పాలన అందించాలని కంకణం కట్టుకున్నామని, కుల, మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి అన్నారు. పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశయమని తెలిపారు. రాష్టాభ్రివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని, పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నానని సీఎం తెలిపారు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించామన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని, తద్వారా నీటి సమస్యను అధిగమించాలని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు