తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల,మే14(జ‌నం సాక్షి): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కివచ్చే భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతోంది. 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇదిలావుంటే తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రెండు కనుమ రహదారుల్లో ఆదివారం మూడు ప్రమాదాలు జరిగాయి. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండో కనుమ రహదారిలో భాష్యకార్ల సన్నిధి సవిూపంలో స్కార్పియో వాహనం అదుపుతప్పి రహదారి గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలోని యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. అదే విధంగా తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి కనుమ మార్గంలో 57వ మలుపు వద్ద కారు టైరు పగిలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన భక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. 33వ మలుపు వద్ద కారు విద్యుత్తు స్తంభాన్ని వాహనం ఢీకొన్న ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం కాంచిపురానికి చెందిన ఇద్దరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. మూడు ప్రమాదాల వద్దకు తితిదే రవాణా విభాగం ఆటోక్లినిక్‌ సిబ్బంది చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

తాజావార్తలు