తిరుమల అలిపిరి ఘటనపై చంద్రబాబు సీరియస్
క్రమశిక్షణ ఉల్లంఘన సరికాదని హెచ్చరిక
అమిత్‌షా కాన్వాయ్‌పై దాడికి ఖండన
అమరావతి,మే11(జనం సాక్షి ): తిరుమలలోని అలిపిరి వద్ద భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై జరిగిన రాళ్లదాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణకు బద్ధులై అందరూ వ్యవహరించాలని.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలిసీ తెలియని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావొద్దని.. ఏ సమయానికి ఎలా స్పందిచాలనేది అందరూ తెలుసుకోవాలని మందలించారు. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చేవరకూ ధర్మపోరాటం కొనసాగుతుందని.. నాలుగేళ్ల మన కష్టంతో అభివృద్ధి చేసుకున్నామే తప్ప కేంద్రం సహకారం లేదని ప్రజలే అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధి ఆగదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెదేపా సంగతి చూస్తామంటూ భాజపా నేతలు బెదిరిస్తున్నారని .. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏవిూ చేయలేరని ఆయన చెప్పారు. న్యాయం కోసం ముఖ్యమంత్రిగా ప్రధానిపై పోరాడుతున్నానని పేర్కొన్నారు. వైకాపా లాలూచీ రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మిగతా పార్టీల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రాళ్లదాడి దురదృష్టకరం: సోమిరెడ్డి
అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లదాడి ఘటన దురదృష్టకరమని మంత్రి సోమిరెడ్డి మోహన్‌రెడ్డి అన్నారు.
భాజపా నేతలే రెచ్చగొడుతున్నారని.. వారి వ్యాఖ్యలను కర్ణాటక ప్రజలు సైతం గమనిస్తున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలకు టిడిపితో సంబంధం లేదన్నారు. అయితే ఎవరు చేసినా దాడి ఘటన సరికాదన్నారు. ఇది మంచిపద్దతి కాదన్నారు.
అమిత్‌షా వాహనంపై రాళ్లు పడలేదు: మంత్రి చినరాజప్ప
అమిత్‌షా వాహనంపై రాళ్లు పడలేదని.. వెనక ఉన్న వాహనాలపై రాళ్లు పడ్డాయని ¬ంమంత్రి చినరాజప్ప వెల్లడించారు. మరోవైపు భాజపా వాళ్లే రెచ్చగొట్టారనే వాదన విన్పిస్తోందని ఆయన వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దాడి చేయడం సరికాదని అన్నారు.