విశాఖ: విశాఖ తూర్పు తీరంలో తొలిసారిగా నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష అట్టహాసంగా సాగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ …70 విదేశీ యుద్ధనౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించి, నౌకాదళ సమీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంతర్జాతీయ నౌకాదళ గౌరవ వందనం స్వీకరించడం అద్భుతమైన అనుభూతినిచ్చిందన్నారు. సాగర మధ్యంలో ఈ పరేడ్ ప్రపంచంతో స్నేహహస్తానికి నిదర్శమని పేర్కొన్నారు. అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష అనుకున్న దానికన్నా అధిక ఫలితాలు ఇచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నౌకలు మన తీరానికి రావడం గర్వకారణమన్నారు. సముద్ర తీర రక్షణలో నౌకాదళ సమీక్ష కొత్త ముందడుగు అన్న ప్రణబ్… శాంతి సామరస్యాలు కాపాడటంలో సంయుక్త ప్రదర్శనలు గొప్ప బలాన్నిస్తాయన్నారు. సముద్రతలంపై శాంతి, ప్రశాంతి నెలకొల్పడంలో నౌకాదళాలది కీలక భూమిక అని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో భారత్ నిర్వహిస్తున్న భూమిక అత్యంత ప్రధానమైందని అభివర్ణించారు. సముద్ర మార్గాల రక్షణ, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు నౌకాదళం అండగా ఉంటుందన్నారు. నౌకాదళానికి సహకారం అందించిన విశాఖ వాసులకు రాష్ట్రపతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి పారికర్, గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళ ప్రధాన అధికారులు పాల్గొన్నారు.