తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు
తూ.గో :తునిలో ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దగ్ధం చేయడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ రైలు మొత్తం దహనమైపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిపోయే సర్వీసులను సైతం నిలిపేయాల్సొచ్చింది. ఫలితంగా వందలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారి ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి.
రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు….
సామాజిక రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనకు దిగింది ఒకరైతే ఇబ్బందులకు గురైంది మాత్రం వేరొకరు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు సామాజిక వర్గం చేపట్టిన ఐక్య గర్జన క్రమంగా హింసకు దారితీసింది. సభ జరుగుతుండగా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రైల్‌రోకోకు పిలుపునివ్వడంతో ఆందోళనకారులంతా ఒక్కసారిగా రైల్ ట్రాక్‌పైకి ఎక్కారు. అదేసమయంలో అటుగా వచ్చిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ బోగీలకు నిప్పుబెట్టారు. క్రమంగా మంటలు అన్ని బోగీలకు అంటుకోవడంతో రైలు గంటలకొలది తగలబడుతూనే ఉంది. ఈ సంఘటనతో వెంటనే తేరుకున్న రైల్వే అధికారులు ఆ మార్గంలో వచ్చిపోయే రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. కొన్నిటిని దారి మళ్లించారు.
గంటల కొలది నిలిచిన రైళ్ళు….
విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి, పూరీ-వోఖా, విశాఖ-కాకినాడ, హౌరా చెన్నై మెయిల్ తదితర ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొలది రైళ్లు నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు మరింత ఇబ్బందికి గురయ్యారు.
తప్పనిసరి పరిస్థితిలో రైళ్ల నిలిపివేత….
తప్పనిసరి పరిస్థితిలో ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేయాల్సొచ్చిందని విజయవాడ డివిజనల్ మేనేజర్ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిస్థితి చక్కబడిన తర్వాతే రైళ్లు నడుపుతామన్నారు. ఇలా సుమారు 20 రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేసినట్లు వివరించారు. ప్రయాణికులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రయాణాలు రద్దు చేసుకున్న వారి టిక్కెట్ డబ్బులను వెనక్కి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
హెల్ప్‌లైన్ నంబర్లు…..
రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడిన దృష్య్టా ప్రయాణికులు బంధువులు ఆందోళనకు గురయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సమాచారం అందించేందుకు అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. విజయవాడకు సంబంధించి 0866-2575038, తుని స్టేషన్ 08854- 252172, రాజమండ్రి స్టేషన్ 0883-2420451, 0833-2420543 నెంబర్లకు ఫోన్ చేసి రైళ్ల రాకపోకల సమాచారం తెలుసుకోవచ్చు.