తెలంగాణలో నాకు ఎలాంటి వ్యాపారులు లేవు
నాకు, పరిటాల కుటుంబానికి ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు
రేవంత్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయి
రేవంత్ జైలుకెళ్లిన సమయంలో పార్టీ అంతా అండగా నిలిచాం
చంద్రబాబు ప్రోత్సాహంతోనే తాను, రేవంత్ ఈ స్థాయికి వచ్చాం
ఆరు నెలలుగా రేవంత్ ఢిల్లీ పర్యటన వివరాలు తన వద్ద ఉన్నాయి
బాబు రాగానే ఆ వివరాలను వెల్లడిస్తా
విలేకరుల సమావేశంలో పయ్యావల కేశవ్
అమరావతి, అక్టోబర్23(జనంసాక్షి) : తెలంగాణాలో నాకు ఒక్క రూపాయి వ్యాపారాలు లేవని, కనీసం ఒక్క ఇల్లు కూడా లేదని తెదేపా పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కేశవ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. దీంతో ఎట్టకేలకు ఆయన సోమవారం స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తన మేనల్లుడు బార్ ఏర్పాటు చేశాడని, భాగ్యనగరంలో ఉన్న ఎన్నో బార్‌లలో అదీ ఒకటి అన్నారు. నాకు, మంత్రి పరిటాల సునితకు మధ్య ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని కేశవ్ పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించాలా? లేదా? అని సందిగ్ధంలో పడ్డానని.. అయితే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. చంద్రబాబును రేవంత్‌రెడ్డి కలిశాక స్పందించాలని అనుకున్నాని చెప్పారు. వ్యక్తిగతంగానే స్పందిస్తున్నాని తెలిపారు. ఐదేళ్లుగా పార్టీలో సైనికుడిలా పనిచేస్తున్నాని పయ్యావుల చెప్పారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే తాను, రేవంత్ ఈ స్థాయికి ఎదిగామన్నారు. తనకంటే రేవంత్‌ను చంద్రబాబు ఎక్కువగా ప్రోత్సహించారని చెప్పారు. రేవంత్ జైలుకెళ్లిన సమయంలో తొలిసారిగా అండగా నిలిచింది తానేనని, పార్టీ మొత్తం రేవంత్‌కు అండగా నిలిచి మద్దతు నిచ్చిందన్నారు. కుమార్తె పెండ్లికి సైతం దగ్గరుండి జరిపించామని పయ్యావుల పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిని చూస్తూ ఆందళన కలుగుతుందని, మిత్రుత్వాన్ని రాజకీయ స్వలాభం కోసం ఇలా వాడుకోవటం బాధాకరమన్నారు. ఆరు నెలలుగా రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలపై తన వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని తెలిపిన పయ్యావుల, రేవంత్ చంద్రబాబును కలిశాకే ఆ వివరాలపై స్పందిస్తానని అన్నారు. ఎదుటివారి వ్యాపారాల గురించి మాట్లాడే ముందు రేవంత్‌రెడ్డి తన వ్యాపారాల గురించి ప్రజలకు చెప్పాలన్నారు. కేసీఆర్ కుమార్తె కవితతో వ్యాపారం పెట్టేందుకు కంపెనీ రిజిస్టర్ చేసింది వాస్తవం కాదా అని పయ్యావుల రేవంత్‌ను ప్రశ్నించారు. రేవంత్‌కు వ్యక్తిగత అజెండాలే ప్రధానమని ఆరోపించారు. జగన్‌తో కలిసిమెలిసి తిరగడం, జగన్ ప్రసార మాధ్యమాలు రేవంత్‌కు సహకరించటం సహా అన్ని తెలుసన్నారు.