తొలి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల
గుంటూరు: ‘ప్రపంచం నివ్వెర పోయే రాజధాని నిర్మిస్తా.. ఇతర దేశాలను తలదన్నే రీతిలో క్యాపిటల్‌ను రూపొందిస్తా’.. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నాటి నుంచి ఏపి సీఎం చంద్రబాబు పనిగట్టుకుని మరీ చెబుతున్న మాటలు ఇవి. అత్యుత్తమ రాజధాని నిర్మాణం జరగాలంటే రైతుల సహకారం అతి ముఖ్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి, రైతులను మభ్యపెట్టి కొన్ని వేల ఎకరాలను సేకరించారు. రాజధాని నిర్మాణానికి ఇవి సరిపోవంటూ ఇప్పుడు భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఏపి ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాజధాని నిర్మాణానికి తొలి భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బలవంతపు భూసేకరణకు దిగుతున్న సర్కార్
ల్యాండ్ పూలింగ్ అసలు రూపం తెలుసుకున్న రైతులు, బంగారం పండే తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములిచ్చేది లేదంటూ హెచ్చరించారు. అయినా అనుకున్నది నెరవేర్చుకోవాలనుకున్న ఏపి ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు దిగుతోంది. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వెలువరించిన ఈ నోటిఫికేషన్ ద్వారా తుళ్లూరు మండల పరిధిలోని 5 గ్రామాల్లో 11ఎకరాల 4 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. భూసమీకరణలో భూములివ్వని రైతుల నుంచి బలవంతపు భూసేకరణతో అన్నదాతల పొట్టకొట్టనుంది.
11ఎకరాల 4 సెంట్ల భూసేకరణ
తొలి నోటిఫికేషన్‌ను అనుసరించి తుళ్లూరు మండల పరిధిలోని పిచ్చుకలపాలెంలో 78 సెంట్లు, అబ్బరాజుపాలెంలో 89 సెంట్లు, తుళ్లూరులో 4ఎకరాల 28 సెంట్లు, బోరుపాలెంలో 83 సెంట్లు,అనంతవరంలో 4 ఎకరాల 26 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణానికి ఏపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. మలి విడతలో వచ్చే నోటిఫికేషన్లను అనుసరించి తాడేపల్లి,మంగళగిరి మండలాల్లో భూములను బలవంతంగా లాక్కోనుంది. అయితే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పేపర్ వర్క్ ను అధికారులు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లోనే మలివిడత నోటిఫికేషన్లను ఏపి సర్కార్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వామపక్షాలు పోరుకు సిద్ధం
అన్నదాతలను నడిరోడ్డుకు ఈడ్చవద్దంటూ వామపక్షాలు కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నాయి. అయినా వీటిని పట్టించుకోని ఏపి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసి తన కపటబుద్ధిని బయటపెట్టుకుంది. దీంతో రైతులకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు వామపక్షాలు సమరశంఖాన్ని పూరించాయి. ఏపి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు అలుపెరగని పోరు చేస్తామని హెచ్చరిస్తున్నాయి.