త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంక్రీటు పనులు డిసెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రతి నెలా మూడో సోమవారం పోలవరం పనుల పరిశీలనలో భాగంగా సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు ఇంత భారీ ప్రాజెక్టు రాలేదని, భవిష్యత్తులో కూడ రాదన్నారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.19 వేల కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చుచేసిందన్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా గత వారం 12.15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితీశారని, వచ్చే నెల నుండి నెలకు 50 నుండి 70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. స్పిల్‌వేలో 21 గేట్ల ద్వారా రోజుకు యాభై లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతుందన్నారు.