త్వరలో హైదరాబాద్లో జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభను చేద్దాం.. వికారాబాద్ మాదిగ సోదరులకు పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగ..
వికారాబాద్ రూరల్ ఆగస్టు 4 జనం సాక్షి
కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీ ఏదైనా అన్ని ఒకటే.. ఏ పార్టీ జెండా మోసిన మన మాదిగ జాతికి వరిగేది ఏమీ లేదు.. అదే మన దండోరా జెండా మోస్తే కనీసం మన జాతికి న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మాదిగలకు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభ కార్యక్రమం సన్నాహక కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న పదేళ్లు.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లు 1 రోజు కూడా మన ఎస్సీ వర్గీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే బిజెపి సైతం పదేళ్ల పాలనలో ఎస్సీ వర్గీకరణపై పార్లమెంటులో బిల్లు పెట్టడం లేదు ఇలాంటి పార్టీలు మనకు అవసరం లేదని మందకృష్ణ మాదిగ అన్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాటలు చెప్పడం తప్ప చేతల్లో కనిపించడం లేదు. పైగా ఎస్సీ వర్గీకరణ నిమిత్తం బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మాదిగ బిడ్డలపై లాఠీ చార్జి చేసి, నన్ను అరెస్టు చేసి జైల్లో వేయించాడు. అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కాబట్టి ఎన్నికలకు ముందు త్వరలోనే హైదరాబాద్ గడ్డమీద జరగబోయే మాదిగల విశ్వరూపం భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి వికారాబాద్ మాదిగ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. లైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ తుప్ప ఆనంద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు పట్టే వరకు ఉద్యమం ఆగదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పి ఆనంద్ పెండ్యాల అనంతయ్య లాలయ్య గోపాల్ శంకర్ రాజు నర్సింలు నియోజకవర్గంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు మాదిగ జేఏసీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు