దళిత సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు
పెరికగూడెం గ్రామంలో దళిత ఆత్మీయ సభ
157వరోజుకు చేరిన జగన్ పాదయాత్ర
విజయవాడ,మే9(జనం సాక్షి): స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దళితుల పట్ల ఇంకా వివక్ష కనపడటం బాధాకరమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై నేటికి దాడులు జరుగుతుండటంపై దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. బుధవారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెరికగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ మాట్లాడారు. మంచి అన్నది మాల అయితే నేను మాలగా పుట్టడానికి సిద్ధమన్న గురజాడ అప్పారావు మాటలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల సమయంలోనే దళితులు గుర్తుకువస్తారని, అప్పుడు వచ్చి తనకంటే పెద్ద దళితుడు ఎవరూ లేరని అంటారని చెప్పారు. ఎన్నికల హావిూల్లో భాగంగా చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్లను సక్రమంగా అమలు చేస్తామని హావిూ ఇచ్చారని, అమలుచేయని వారిని జైల్లో పెడతామని పేర్కొన్నారని గుర్తు చేశారు. అంటే నాలుగేళ్లలో కనీసం ఒక్క ఏడాదైనా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లను అమలు చేయని చంద్రబాబును ఇప్పుడు జైల్లో పెట్టాలా? అంటూ ప్రశ్నించారు. ఇదే ముఖ్యమంత్రి దళితుడిగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని వ్యాఖ్యానించడం సిగ్గు చేటని, నాయకుడు చూపిన బాటలోనే టీడీపీ నేతలు నడుస్తూ దళితులపై దారుణాలకు ఒడిగడుతున్నారని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తనని తాను చంద్రబాబు దళిత తేజంగా కీర్తించుకుంటున్నారని, ఇలాంటి వ్యక్తి దళిత తేజం అయితే దళితులందరూ ఎక్కడిపోవాలని ప్రశ్నించారు. ‘నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు దళితులకు ఎక్కడైనా మేలు చేసినట్టు కనిపించిందా?. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులు
ఇబ్బందులు పడుతున్నారు. కారంచేడు ఘటన నుంచి ఇప్పటివరకూ అదే తరహాలో టీడీపీ పాలన సాగుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 157వ రోజు పాదయాత్రను కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి శివారు నుంచి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించి జననేత ముందుకు కదిలారు. పెయ్యేరు, డాకరం క్రాస్, కానుకొల్లు, పుట్ల చెరువు క్రాస్, లింగాల విూదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. పెరికగూడెంలో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొంటారు. సమావేశం అనంతరం రాత్రికి ఆయన ఇక్కడే బస చేస్తారు.