దుమారం రేపిన నిట్‌ వ్యవహారం

6fk9g9k6పశ్చిమగోదావరి: జిల్లాలో నిట్‌ ఏర్పాటు వ్యవహారం పెద్ద దుమారం రేపింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. అటు ఏలూరు, ఇటు తాడేపల్లిగూడెం మధ్య ఊగిసలాడిన వ్యవహారం చివరకు ఢిల్లీ పెద్దల జోక్యంతో గూడెం వైపు మొగ్గుచూపింది. దీంతో మంత్రి మాణిక్యాలరావు పంతం నెరవేరింది. ఈనెల 20న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది.
మారిపోయిన పరిణామాలు
అయితే ఇంత కాలం నిట్‌ ఏలూరుకే దక్కుతుందని టీడీపీ నేతలు భావించారు. దీనికోసం ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో సహా పలువురు టీడీపీ నేతలు చాలా ప్రయత్నం చేశారు. వీరికి చంద్రబాబు నుంచి మద్దతు కూడా లభించినట్లు తెలిసింది. దీంతో ఏలూరుకు నిట్‌ వస్తుందని టీడీపీ నేతలు ఎంతోగానో కలలు కన్నారు. కానీ.. చివరకు ఏం జరిగిందో తెలియదు… పరిణామాలన్నీమారిపోయాయి. చివరకు తాడేపల్లిగూడెంకు నిట్‌ మళ్లింది.
అసంతృప్తిలో టీడీపీ నేతలు
తెలుగు తమ్ముళ్లు ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరి వరకు పోరాడినా తమ ప్రాంతానికి నిట్‌ దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో తమ నేతల సహకారంతో.. మంత్రి మాణిక్యాలరావు నిట్‌ను దక్కించుకున్నారని భావిస్తున్నారు. సమయం చిక్కితే బీజేపీ నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని తెలుగు తమ్ముళ్లు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.
ఆరోపణలను కొట్టిపారేస్తున్న బీజేపీ
మరోపక్క బీజేపీ నేతలు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. తమ మధ్య కొందరు అపోహలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాల మూలంగానే నిట్‌ విషయంలో సమస్య ఏర్పడిందని మంత్రి మాణిక్యాలరావు అంటున్నారు. తామంతా ఐక్యంగానే ముందుకు సాగుతున్నామంటున్నారు.

తాజావార్తలు