ధాన్యం మద్దతు ధరలపై ఆందోళన
ఏలూరు,అక్టోబర్17(జనంసాక్షి): స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటల మద్దతు ధరలు పెంచుతామని ఎన్నికల సమయంలో హావిూలు ఇచ్చిన భాజపా, తెలుగుదేశం ప్రభుత్వాలు రైతాంగాన్ని మోసగించాయని కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ విమర్శించారు. క్వింటాలు ధాన్యం ఉత్పత్తికి సగటున రూ.1700లు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాల్సి ఉందన్నారు. ధాన్యం మద్దతు ధరను పెంచి అమలు చేయాలని, లేకుంటే రైతాంగం ఉద్యమానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా ప్రస్తుత మద్దతు ధర రైతాంగానికి ఏమాత్రం గిట్టుబాటుకాదన్నారు.