ధృవీకరణ కోసం కౌలురైతుల అవస్థలు
ఏలూరు,డిసెంబర్20(జనంసాక్షి): కౌలు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కౌలురైతుల సంఘం నాయకులు కోరారు. ధ్రువీకరణకు అసలు రైతులు సహకరించక పోవడంతో విధిలేని పరిస్థితిలో వీరు దళారీలను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది ధాన్యం నమూనాలు సేకరించేందుకు కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పంటలు సాగుచేస్తున్న వారిలో 80 శాతం మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రస్తుతం ధాన్యాన్ని అమ్ముకునేందుకు పలువురు రైతులు కొనుగోలు కేంద్రాలను ఆశ్రయిస్తున్నా లాభం లేకపోతోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే కౌలు రైతు ధ్రువపత్రం అందజేయాల్సి ఉంది. అందుకు పాసుపుస్తకం నకలు ఇచ్చేందుకు అసలు రైతు సహకరించడం లేదు. ఈ నిబంధనతో ధాన్యం కొనుగోలుకు ఈ కేంద్రాలనిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీని ఫలితంగా రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు పొలంలోనే తూకం వేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనంలో తీసుకెళ్తుండడంతో రైతులు కూడా వారి వైపే మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం క్షేత్ర స్థాయిలో సమస్యలతో నీరుగారి పోతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా పలు చోట్ల అవి మొక్కుబడిగా మారాయి. మిల్లర్ల అందజేసే వివరాల నమోదుకే ఈ కేంద్రాల సిబ్బంది పరిమితవుతున్నారు. అయితే కౌలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు అన్నారు. దీనికి వీఆర్‌వో ధ్రువపత్రం ఇస్తే సరిపోతుంది. ఈ విషయంపై మరో దఫా స్పష్టమైన సూచనలు చేస్తామన్నారు.