నన్నయలో డొక్కా సీతమ్మ డిప్లమో కోర్సు: విసి

కాకినాడ,మే2( జ‌నం సాక్షి): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగాల నిమిత్తం శ్రీమతి డొక్కా సీతమ్మ డిప్లమో కోర్సును ప్రారంభిస్తున్నామని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలు నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్యకు తొలిమెట్టు అంగన్‌వాడీ కేంద్రాలని, వాటిలో నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో ఈ కోర్సును ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరునెలల కాలపరిమితితో ఉండే ఈ కోర్సులో చేరేందుకు కనీస పదో తరగతి
విద్యార్హత ఉండాలి. జూన్‌ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వీసీ తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, భీమవరంలో ఈ కోర్సుకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.  అంగన్‌వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీరికి శనివారం, ఆదివారం మాత్రమే తరగతుల నిర్వహిస్తామన్నారు.

తాజావార్తలు