నయీం నన్నుకూడా బెదిరించాడు
– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఆదిలాబాద్,ఆగస్టు 16(జనంసాక్షి):నల్లగొండ జిల్లాలో నయీం ముఠా ఆగడాల గురించి తాము గతంలోనే నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పామని, కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. తాము ఇంకా పట్టుబడితే నయీంకు చెప్పి తమను హత్య చేయించేవారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. . తెలంగాణ శాసన మండలి సమావేశాలు జరిగేటప్పుడు.. హైదరాబాద్‌లో లక్ష సీసీటీవీ కెమెరాలు పెడుతున్నామని మంత్రి చెబితే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదని, పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాలో మాఫియా రాజ్యం కొనసాగుతోందని, తనను చంపడానికి కుట్ర పన్నుతున్నారని కూడా తాను స్వయంగా చెప్పానని ఆయన అన్నారు.తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నయీం ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయి గానీ వాటిని తాను పట్టించుకోలేదని ఆయన తెలిపారు. ఇక టీఆర్‌ఎస్ నాయకులైతే.. నయీం ముఠాతో బెదిరించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీల నుంచి నాయకులందరినీ టీఆర్‌ఎస్‌లో చేర్పించారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది టీఆర్‌ఎస్‌లో చేరారని, నయీం వల్ల లబ్ధి పొందినవాళ్లలో 90 శాతం మంది ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. వాళ్ల దగ్గర కోట్ల రూపాయలున్నాయని అన్నారు.నయీంది ఎన్‌కౌంటర్ కాదని, అతడిని ముందుగానే చంపేసి ఎక్కడికో తీసుకెళ్లి పారేశారని కూడా రాజగోపాలరెడ్డి ఆరోపించారు. అతడి దగ్గర ఉన్న ఆస్తులన్నింటినీ ముందుగానే లాక్కున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తేనే ప్రజలు నమ్ముతారని ఆయన తెలిపారు. నయీం ముఠా ఐదు రాష్ట్రాల్లో తన ఆగడాలు కొనసాగించింది కాబట్టి.. సీబీఐ ద్వారా విచారణ చేయిస్తేనే నిజమైన దోషులు బయటపడతారని అన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. నయీంను హతమార్చినందుకు ప్రభుత్వాన్ని తాను కూడా అభినందిస్తాను గానీ.. అతడి వెనక ఉన్న పెద్దలను బయటకు లాగాలన్నదే తన డిమాండ్ అని చెప్పారు.నయీం అండతో కోట్లకు పడగలెత్తారని అన్నారు. ఈ వ్యమౄరంపై సిబిఐ విచారణ జరపాలన్నారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఆదిలాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పోటీ నుంచి తనను తప్పుకోవాలని నయీం మనుషులు ఒత్తిడి చేశారని చెప్పారు. నయీం ముఠా కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో ప్రతి టీఆర్‌ఎస్ నాయకుడు నయీం అనుచరుడేనని ఆరోపించారు. నయీంతో కలిసి ఓ టీఆర్‌ఎస్ నాయకుడు కోట్ల రూపాయలు సంపాదించాడని వెల్లడించారు. నయీం డైరీలో ఉన్నవన్నీ టీఆర్‌ఎస్ నాయకుల పేర్లేనని పేర్కొన్నారు. డైరీలో ఉన్న పేర్లతో 99 శాతం టీఆర్‌ఎస్ నాయకులవేనని అన్నారు. నయీం డైరీని అడ్డంగా పెట్టుకుని రాజకీయ నాయకులను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. వారికి ఇచ్చిన హావిూలు అమలు కావడం లేదన్నారు.