నర్సుల మీద పెరుగుతున్న పనిభారం

విజయవాడ:మన దేశంలో నర్సుల కొరత తీవ్రంగా వుంది. ఐదారుగురు నర్సులు చేయాల్సిన పనిభారాన్ని ఒకే ఒక్క నర్సు మోయాల్సి వస్తోంది. అత్యంత ఓర్పు, సహనంతో చేయాల్సిన వృత్తి నర్సింగ్‌. ఆస్పత్రిలో చేరిన పేషెంట్లను కంటికి రెప్పలా చూసుకునేదీ నర్సులే. ఆపరేషన్‌కు ముందు, ఆపరేషన్‌ తర్వాత అవసరమైన వైద్య సేవలన్నీ అందించేదీ వీరే. తమ దగ్గరకు వచ్చే పేషెంట్లను అమ్మ కంటే ఓపికగా లాలించే ఎందరో నర్సులు మనచుట్టూ వున్నారు. నర్సింగ్‌లో అత్యుత్తమ సేవలందించిన నైటింగేల్‌కు ప్రపంచం ఇప్పటికీ చేతులెత్తి నమస్కరిస్తుంది.ఒకప్పుడు నర్సింగ్‌ వృత్తి మీద చిన్నచూపు వుండేది. అగ్రవర్ణాలవారు, ఆర్థికంగా ఎదిగినవారు ఈ వృత్తిలోకి వచ్చేవారు కాదు. 20 ఏళ్ల క్రితం దళిత, బలహీన వర్గాలకు చెందినవారే ఈ వృత్తిలోకి ప్రవేశించేవారు. సమాజం చిన్నచూపు చూసిన నర్సింగ్‌ వృత్తిని ముందుగా ముద్దాడినదీ, ఆ వృత్తిలోని మానవీయతను, ఆ వృత్తి నిర్వహణకు కావాల్సిన సహనాన్ని, ఓర్పునూ, దయను, ప్రేమనూ మనకు పరిచయం చేసినదీ దళిత, బలహీనవర్గాల స్త్రీలే కావడం విశేషం. కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆస్పత్రుల్లో కేరళ నర్సులే ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు తెలుగమ్మాయిల సంఖ్య పెరిగింది.పది పదిహేనేళ్ల నుంచి నర్సింగ్‌ వృత్తిని చూసే ధోరణిలో మార్పు వస్తోంది. ఇప్పుడు ఈ వృత్తిలో అగ్రవర్ణాలవారు సైతం కెరీర్‌ మెట్లను వెదుక్కుంటున్నారు. దీంతో ఈ వృత్తిలోకి అన్ని కులాలవారూ ప్రవేశిస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో నర్సింగ్‌ చేసినవారికి మంచి డిమాండ్‌ వుండడంతో అదొక క్రేజ్‌గా కూడా మారుతోంది. దీంతో నర్సింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో సీట్లన్నీ భర్తీ అయి కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో ప్రతి ఏటా మూడు వందల మంది ట్రయినింగ్‌ పూర్తి చేసుకుంటున్నారు. బిఎస్సీ నర్సింగ్‌ కోర్సుతో పాటు ప్రయివేట్‌ నర్సింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్న వారి సంఖ్య దాదాపు పదివేల దాకా వుంటుందని అంచనా.అయితే, మన దేశ అవసరాలకు తగిన రీతిలో నర్సుల సంఖ్య పెరగడం లేదు. ఇప్పటికీ నర్సుల కొరత తీవ్రంగానే వుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక నర్సు అవసరం. కానీ, మన దేశంలో ప్రతి పదకొండు వందల మందికి ఒక నర్సు వున్నారు. ఆస్పత్రిలో ప్రతి ఐదుగురు రోగులకు ఒక నర్సు చొప్పున సేవలందించాల్సి వుంటుంది. కానీ, మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 మంది రోగులకు ఒక నర్సు సేవలందించాల్సి వస్తోంది. అంటే, ఒక్కొక్కనర్సు ఐదు రెట్ల పనిభారాన్ని తమ భుజస్కందాలపై వేసుకుంటున్నారు. ఇలా పనిభారం పెరగడం వల్ల చిరునవ్వుతో వైద్య సేవలందించే ఆ సేవామూర్తుల్లోనూ అప్పుడప్పుడూ విసుగు కనిపిస్తోంది. కొన్ని రకాల ప్రమాదకర కేసులకు సేవలందించే సందర్భంలో తాము కూడా ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడే అవకాశం వున్నప్పటికీ , చిరునవ్వుతో ఆ బాధ్యతను మోస్తున్న నర్సులెందరో మనకు కనిపిస్తారు. ఇక ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో వీరికిస్తున్న వేతనాలు అతి తక్కువగా వున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో నెలకు అయిదు వేల రూపాయలకు మించి ఇవ్వడం లేదు. తాము పొందిన సేవలకు కృతజ్ఞతా భావంతో పేషెంట్లు చేతిలో పెట్టే కొద్దిపాటి మొత్తమే చాలామంది నర్సుల జీవితాలకు ఆలంభనగా నిలుస్తోంది. మానవత్వపు పరిమళాన్ని తమ సేవాభావంతో గుబాళింపచేస్తున్న నర్సుల మీద పనిభారం పెరగకుండా, న్యాయమైన వేతనాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వున్నది.

తాజావార్తలు