నాయి బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిథ్యం
– పాదయాత్రలో వైఎస్ జగన్ హావిూ
గుడివాడ, మే8(జనం సాక్షి) : నాయి బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హావిూయిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను మంగళవారం నాయి బ్రాహ్మణులు కలిశారు. తమ సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక నాయి బ్రాహ్మణులకు అన్ని విధాల మేలు చేస్తామన్నారు. నాయి బ్రాహ్మణులు లేకపోతే నాగరికత ముందు సాగలేదన్నారు. నేడు వీరు బతకలేని పరిస్థితి ఉందని, చిన్న కులం కావడంతో రాజకీయంగా ఎవరూ పట్టించుకోలేదన్నారు. క్షౌరశాలల్లో ఫ్యాన్‌లు, టూబ్‌లైట్లకు రూ. 8 నుంచి రూ. 14 వరకు కరెంట్ చార్జీలు వసూలు చేస్తున్నారని, కనీసం 4 వేల రూపాయలు కరెంట్ బిల్లు కట్టాలంటే ఎలా బతకాలని వాపోతున్నారని పేర్కొన్నారు. సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, 500 యూనిట్ల వరకు డొమెస్టిక్ టారీఫ్ ఉండేలా చూస్తామని తెలిపారు. ప్రతి షాపుకు రూ. 10 వేలు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధం లేదా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రెండింటిలో ఒకటి అందిస్తామని జగన్ తెలిపాడు. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ బదులుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని, ఆలలయాల్లోనూ నాయి బ్రాహ్మణులు పనిచేస్తున్నారని, వాయిద్య కళాకారులుగా దేవుడికి సేవలు అందిస్తున్నారని, ఆలయాల్లో వీరిని పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. వేతన భద్రత లేదని, వీళ్లకు జరగాల్సిన మేలు కచ్చితంగా చేస్తామని జగన్ హావిూ ఇచ్చారు. ఆలయాల్లో పీస్ రేట్ల వల్ల క్షురకులు ఇబ్బంది పడుతున్నారని గుర్తింపు పొందిన ఆలయాల్లో గుర్తింపు కార్డులు ఇచ్చి, స్థిరవేతనాలు ఇస్తాం. పాలక మండళ్లలో సభ్యులుగా అవకాశం కల్పిస్తాం. వాయిద్య కళాకారులకు ఇదేరకమైన మేలు చేస్తాం. చట్టసభల్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తాం. నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరులు, రజకులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఇటువంటి కులాలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తామని జగన్ హావిూ ఇచ్చారు.