నిరంతర శ్రమతోనే విజయం సాధ్యం
హైదరాబాద్ అభివృద్దికి అదే కారణం
అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది
టీమ్ వర్క్‌తో దేన్నయినా సాధంచవచ్చు: బాబు
అమరావతి,మే9(జనం సాక్షి): నూతన ఆలోచనల సృష్టికి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేందుకు కలెక్టర్ల సమావేశం దోహదపడుతుందని సిఎం చంద్రబాబు తెలిపారు. రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ఆయన మధ్యాహ్నం మాట్లాడుతూ.. సంక్షోభంలో జట్టుగా పనిచేసి ఎక్కడా లేని అభివృద్ధి సాధించాం. ఇప్పటివరకు సాధించిన ఫలితాలలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందన్నారు. గతంలో తన హయాంలో చేసిన అభివృద్ది గురించి తెలుసుకుని ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మన రాష్ట్రానికి వచ్చారు. వ్యక్తిగతంగా నాకేవిూ ప్రయోజనం లేకున్నా అక్కడున్న ప్రజల కోసం హైదరాబాద్ అభివృద్ది చేశా .. విజయం అనేది నిరంతరం శ్రమతో సాధ్యం, కొద్దిపాటి మనసుపెడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. అమరావతిని ఏరియల్ సర్వేలో పరిశీలించిన నార్మన్ పోస్టర్స్ ఇటువంటి నగరం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ మనదే. ఒక జిల్లా విజయం సాధించాలన్నా, ఒక కార్యదర్శి విజయం సాధించాలన్నా, మంత్రి విజయం సాధించాలన్నా మంచి జట్టును ఏర్పాటు చేసుకోవాలన్నారు. 2029 కంటే ముందే దేశంలో ఏపీ నెంబర్‌వన్ అవుతుంది, నా జట్టును అంటే మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం రెట్టింపయ్యింది, విూ అందరికీ నా అభినందనలు. మన రాష్ట్ర జనాభా ఐదు కోట్లు, మనం మార్కెటింగ్ చేసుకోవడానికి దేశంలో 120 కోట్ల జనాభా వుంది. అమరావతి ఎంతో ఆహ్లాదకరంగా,
సుందరంగా వుంది. ప్రపంచంలో ఇన్నోవేటర్స్ అందరూ ఏపీకి వచ్చేలా చూడాలి, వాళ్ల ఆవిష్కరణలకు మన రాష్ట్రం వేదిక కావాలన్నారు. ఇండియాలో ఇన్నోవేషన్ వ్యాలీ ఎక్కడ వుంది అంటే ఏపీనే గుర్తకురావాలి, ఆరోజు ఎంతో దూరంలో లేదన్నారు. ప్రతీ శాఖ వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచన చేయాలి. పంచాయతీ రాజ్ శాఖ ఈ విషయంలో ముందుంది, గ్రామాలకు సంబంధించి సమస్త సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయడం అభినందనీయమన్నారు.