నిర్మలాసీతారామన్ కు ‘పొగాకు’ సెగ
ప్రకాశం : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు పొగాకు రైతుల సెగ తాకింది. పంట గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రంలో కనీస కదలిక లేదంటూ…ప్రకాశం జిల్లాలో అన్నదాతలు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. పొగాకు రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి పిలుపునిచ్చారు. అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారుఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రకాశం జిల్లాలో పర్యటించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రమంత్రి పత్తిపాటి పుల్లారావు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పొగాకు వేలం కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పరామర్శకు వెళుతుండగా రైతు సంఘం నాయకులు, పొగాకు రైతులు కేంద్రమంత్రి కారును అడ్డగించి ఆందోళన చేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టి కేంద్రమంత్రి కాన్వాయ్ ను ముందుకు పోనిచ్చారు.ఇదిలా ఉంటే పొందూరులో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబాన్ని నిర్మలా సీతారామన్ పరామర్శించారు. దాదాపు పది నిముషా పాటు వారితో మాట్లాడిన సీతారామన్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆత్మహత్యలు వద్దని భరోసా ఇచ్చారు. అలాగే కందుకూరులో బలవన్మరణానికి పాల్పడిన వెంకటరావు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. తర్వాత విజయవాడుకు వెళ్లిన సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పొగాకు బోర్డు అధికారులతోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పొగాకు రైతులు సమస్యలు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. లోకేటగిరి పొగాకును కొనాలని అధికారులను ఆదేశించామన్న కేంద్రమంత్రి, కేంద్రం నుంచి కేజీకి అదనంగా 15 రూపాయలు చెల్లిస్తామన్నారుపొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.