నిర్మాణ రంగానికి కుదుపు తప్పదు
విశాఖపట్టణం,నవంబర్11(జనంసాక్షి): జిఎస్టీ నుంచి గృహనిర్మాణరంగానికి భారీగా తగ్గింపు ఇవ్వాలని లేకుంటే నిర్మాణ రంగంలోని అసంఘటిత కార్మికులకు అన్యాయం జరగగలదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు పేర్కొన్నారు. నిర్మాణ రంగంపై జిఎస్టీ 28శాతం వల్ల కార్మికులపై ప్రభావం చూపనుందన్నారు. అలాగే గృహనిర్మాణ రంగం మందగించగలదని అన్నారు.
పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వల్ల దేశానికి, ప్రజలకు చేటు కలిగిందని గుర్తించాలని ఈ సందర్భంగా నర్సింగరావు అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలపై పెనుభారం పడిందన్నారు. నోట్ల రద్దు నాటికి 6.7 శాతంగా ఉన్న జిడిపి ఇప్పుడు 5.7 శాతానికి పడిపోయిందన్నారు. ఎగుమతులు తగ్గిపోయాయని తెలిపారు. 3వ దశ ఆర్థిక సంస్కరణల పేరుతో పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల అవినీతి తగ్గుతుందని, నల్లధనం అరికట్టబడుతుందని, ఉగ్రవాదం అంతమవుతుందని, దొంగనోట్ల బెడద ఉండదని చెప్పి మభ్య పెట్టారని అన్నారు. అలాగే జిఎస్టీతో ధరలు తగ్గుతాయని చెప్పి వంచించారని అన్నారు. నోట్లు రద్దు ద్వారా పట్టుబడిన దొంగ డబ్బును ప్రతి పేదవాడి బ్యాంక్ ఖాతాలో వేస్తానని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారన్నారు. ఏడాది గడిచినా ఇవేవిూ అమలు కాలేదని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపిన వారికి ఛార్జీల మోత మోపారన్నారు. ఏడాది తర్వాత ఎంత నల్ల ధనం బైటపడిందో చెప్పాలని డిమాండ్‌చేశారు. నోట్ల రద్దు భారీ కుంభకోణమని విమర్శించారు. జిఎస్టీ,పెద్దనోట్ల రద్దు వల్ల కార్పొరేట్లు ప్రయోజనం పొందారు తప్పితే సామాన్యులకు ఒరిగిందేవిూ లేదని విమర్శించారు. అవినీతి, నల్లధనానికి ఆజ్యంపోసే నయా ఉదారవాద విధానాలను ఒక వైపు ఉన్నతంగా అమలు చేస్తూ మరో వైపు ఆ విధానాల పర్యవసాలనపై పోరాడుతానని మోడీ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదం మన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రజలు పెద్ధ ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.