నీటి తరలింపసునకు డీజిల్‌ ఖర్చు 4కోట్లు

ప్రతిపాదనలు సిద్దం చేసిన అధికారులు
కాకినాడ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): నీటి ఎద్దడి సమయంలో మోటార్‌ ఇంజిన్ల ద్వారా సాగునీరు తోడుకునే రైతులకు డిజిల్‌ ఖర్చులు ఇచ్చేందుకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు గోదావరి తూర్పు డెల్టా అధికారులు చెప్పారు.తూర్పు డెల్టాలో 2 లక్షల 64 వేల ఎకరాలు, మధ్య డెల్టాలో లక్షా 72 వేల సాగుభూమి ఉందని, ప్రతి ఎకరానికీ నీరందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సాగునీటి వాడకంలో రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సహకరించాలని కోరారు. జిల్లాలో సాగుకు 4 వేల క్యూసెక్కుల నీరు అవసరం ఉందన్నారు.
జిల్లాలో డిసెంబర్‌ 31 నాటికి వరినాట్లు పూర్తి చేస్తే సాగునీటి ఎద్దడి నుంచి రైతులు బయట పడతారని అన్నారు.  ప్రతి ఎకరానికీ సాగునీరందించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా  ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పి.అప్పలరాజు అన్నారు.సాగునీటి సద్వినియోగంపై నీటిసంఘాల అధ్యక్షులు, రైతులకు  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతానికి 3,500 క్యూసెక్కుల సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తూర్పు డెల్టాలో ఒక క్యూసెక్కు నీటిని 85 ఎకరాలకు, మధ్య డెల్టాలో ఒక క్యూసెక్కు నీటిని 100 ఎకరాలకు అందిస్తున్నట్లు చెప్పారు. ఆయకట్టు శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సాగునీరు సక్రమంగా అందక వరి పంట పూర్తిగా నాశనమైపోయి నష్టపోతున్నామని కొందరు రైతులు అన్నారు. పొలాలకు నీరు అందడం లేదని, నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం ఆక్వా చెరువులకు సాగునీరు తరలిస్తున్నారని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

తాజావార్తలు