నీరుచెట్టు ప్రజల కార్యక్రమం : జడ్పీ చైర్మన్
అనంతపురం,మే7(జనంసాక్షి): ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చెరువుల పూడికతీత పనుల్లో ప్రజల భాగస్వామ్యం కావాలని జడ్పీ ఛైర్మన్ చమన్ పిలుపునిచ్చారు. ప్రజల అండతోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో ఎంతగా పాల్గొంటే అనంత జిల్లా కరవుకు దూరం కాగలదని అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం మానవాళి మనుగడకు ఆయువుపట్టు అని, నేటితరానికే కాకుండా భావితరాలకు అవి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని అన్నారు. కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చమన్ తెలిపారు. చెరువుల పూడికతీత పనులు తమవిగా రైతులు గుర్తించాలన్నారు. ఇందులో అక్రమాలకు తావు లేకుండా అంతా ముందుండి జరుపుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో వర్షం నీరు చెరువులో ఎక్కువగా నిలిచి భూగర్భజలాలు పెరిగేందుకు దోహదపడుతాయని అన్నారు. అలాగే పూడిక మట్టిని రైతులు పొలాలకు తరలించు కోవడంతో భూమి సారవంతంగా తయారవుతుందన్నారు. రైతులు పూడికతీత మట్టిని తరలించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. రైతుల భాగస్వామ్యంతోనే మట్టి పనులు సాగాలన్నారు. పూడికతీత పనులను ఓ ఉద్యమంలా చేపట్టాలని, చెక్‌డ్యాంలు, నీటికుంటలు తవ్వి వర్షం నీరు ఒడిసి పట్టుకోవాలని ప్రజలకు తెలిపారు. లేకుంటే వెనకబడ్డ అనంతలో నీటి కరువు తప్పదని హెచ్చరించారు. వర్షాకాలానికి ముందే ఈ పనులు పూర్తి చేసుకోవాలన్నారు.