నెల్లూరు రెడ్‌క్రాస్ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్
నెల్లూరు,మే3(జనం సాక్షి): పొదలకూరు రోడ్డులోని రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆస్పత్రిని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి పాల్గొన్నారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సోమిరెడ్డి,గవర్నర్‌ను సత్కరించారు. గవర్నర్ నరసింహన్ బుధవారం రాత్రి నెల్లూరు నగరానికి వచ్చారు. రైల్వేస్టేషన్ నుంచి నేరుగా ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. నెల్లూరు ఆర్డీవో డి.హరిత, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టరు పీఏ(ఆర్డీవో) ఎం.వి.రమణ, ఇతర అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలిచ్చి ఆహ్వానించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ముత్యాలరాజు, ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, జేసీ వెట్రి సెల్వి, ఐసీడీఎస్ ఇన్‌ఛార్జి పీడీ పి.ప్రశాంతి గవర్నర్‌తో కొంత సమయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిల్లా పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లాలో అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, ఆర్థిక వనరులు, ఇతర అంశాలతో పాటు అభివృద్ధి ఎలా ఉందని, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కలెక్టరును వివరాలు అడిగారు. తర్వాత జిల్లాలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, ఇతర అంశాలపై ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నెల్లూరు జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలు, వనరులు ఉన్నాయని గవర్నర్ జిల్లా అధికారులతో అన్నారు. అలా కొద్దిసేపు వారితో ముచ్చటించారు.