నేటినుంచి పాడేరు జాతర

 విశాఖపట్టణం,మే5(జ‌నం సాక్షి ): మన్యం ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. పాడేరు కేంద్రంగా గతం కంటే వైభవంగా జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆలయ కమిటీతోపాటు ఐటీడీఏ ఏర్పాటు చేసిన కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. మోదకొండమ్మ ఉత్సవాలకు మంత్రులు రానున్నారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికారులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. ఆదివారం అమ్మవారి ఆలయం నుంచి సతకంపట్టు వరకు మోదకొండమ్మ ఘటాల ఊరేగింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు హాజరవుతారని చెప్పారు. ఉత్సవాల ముగింపు రోజున జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు రానున్నారని పేర్కొన్నారు.

తాజావార్తలు