నేటినుంచి సిపిఎం జిల్లా మహాసభలు
ఏలూరు,నవంబర్17(జనంసాక్షి): వివిధ సమస్యలపై చర్చించి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా సీపీఎం జిల్లా మహాసభలు మూడురోజులపాటు జరుగనున్నాయి. ఈనెల 18, 19, 20 తేదీల్లో ఏలూరులో వీటిని నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం తెలిపారు. జిల్లాలో ఈ మూడేళ్లలో సీపీఎం పోలవరం నిర్వాసితుల సమస్యలపైన, ఏజెన్సీలో గిరిజనులకు దక్కాల్సిన భూములపై పోరాటాలు పెద్ద ఎత్తున చేసిందన్నారు. తుందుర్రు ఆక్వాపుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి నాయకత్వం వహించిందన్నారు. గరగపర్రులో దళితుల వెలిపై పోరాడిందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు చేశామన్నారు. ఈ సభలకు ముఖ్య అతిథులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపి పి. మధు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు మిడియం బాబూరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ వి. ఉమామహేశ్వరరావు పాల్గొంటారన్నారు.