నేటి నుంచి నీరు – ప్రగతి కార్యక్రమాలు

తెనాలి : శాశ్వత కరవు నివారణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీరు – ప్రగతి కార్యక్రమాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో వేమూరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నీరు – ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వం ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. నీటి పరిరక్షణ, నీటి నిర్వహణ, మొక్కల పెంపకం, నదుల అనుసంధానం, కరవు నివారణ చర్యలకు ఇందులో భాగం కల్పించారు. ఈ కార్యక్రమంలో నీటి వినియోగదారుల సంఘాలు, రైతులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములుగా చేస్తున్నారు. వీరికి నీటి వనరుల పరిరక్షణ, నీటి నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. 60 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రతి శుక్రవారం రెండు గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు. ప్రతి బుధవారం విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, డిబేట్‌ తదితర పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఒక రోజున రైతులు, సాగు నీటి సంఘాల బాధ్యులు, పోటీల విజేతలకు ఒక బస్సు ఏర్పాటు చేసి పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల యాత్రకు తీసుకు వెళ్లే విధంగా రూపకల్పన చేశారు. జిల్లాలో మొదటిగా వేమూరు నుంచి శనివారం పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులకు బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. అదే విధంగా 4న అమృతలూరు, 5న రేపల్లె, 6న పొన్నూరు, 7న బాపట్ల, 8న తెనాలి, 9న మంగళగిరి, 10న ప్రత్తిపాడు, 11న చిలకలూరిపేట, 12న నరసరావుపేట, 13న సత్తెనపల్లి, 14న పెదకూరపాడు, 15న గురజాల, 16న వినుకొండ, 17న మాచర్ల, 18న తాడికొండ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్రలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌ కన్వీనర్‌గా ఉంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో కన్వీనర్‌గా, జలవనరుల శాఖ అధికారులు కో-కన్వీనర్లుగా, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు. ఈ కమిటీలు తమ పరిధిలో నీరు – ప్రగతి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదికలు రూపొందిస్తాయి. కార్యక్రమం ముగింపు రోజైన డిసెంబర్‌ 3వ తేదీన ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన 100 మంది విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపి, విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని శనివారం వేమూరు నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జల వనరుల శాఖ ఈఈ పి.వెంకటరత్నం తెలిపారు. ఎమ్మెల్యే ఆనందబాబు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులకు బస్సు యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు.

తాజావార్తలు