నేడు కాకినాడ కార్పోనేషన్ ఎన్నికలు
భారీగా భద్రత ఏర్పాటు
కాకినాడ,ఆగస్ట్28: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. ప్రచారం ముగియడంతో ఈ నెల 29న జరుగనున్న ఎన్నికలకు ఇసి అన్ని ఏర్పాట్లుచేసింది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముద్రగడ ఆందోళనల నేపథ్యంలో మరింత జాగ్రత్త చేపట్టారు. మొత్తం 48 వార్డులకు 196 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. అభివృద్ధే ప్రధాన ఎజెండాగా అధికార తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ తరఫున సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు కాకినాడలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా, భాజపా ఓటర్లను గెలిపించాలని కోరారు. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 39 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు, 9 వార్డుల్లో భాజపా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల హావిూలను విస్మరించారంటూ వైకాపా ప్రచారం నిర్వహించింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఆదివారం ఆ పార్టీ
అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి, బొత్స, రోజా తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 48 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. మొత్తం 17 వార్డుల్లో అభ్యర్థులను ఆ పార్టీ బరిలోకి దింపింది. ఆ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పల్లంరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో 121 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.