నేడు తిరుపతిలో రైతు కోసం చంద్రన్న యాత్ర !
తుమ్మలగుంట, రైతు కోసం చంద్రన్న యాత్ర గురువారం తిరుపతికి చేరుకోనుంది. ఇందుకోసం ఎస్వీ పశువైద్య కళాశాల క్రీడా మైదానంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టారు.ఉదయం 9.30గంటల నుంచి 11గంటల మధ్య కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన పాడిరైతుల సమాచార కేంద్రాన్ని, మ్యూజియాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారు. అదేవిధంగా గ్రామాల్లో పర్యటించే గోపాల మిత్రలకు ద్వి చక్రవాహనాలను పంపిణీ చేస్తారు.11గంటలకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించి కొత్తరకం పంటలపై జరుగుతున్న పరిశోధనలు, విత్తన ఉత్పత్తులకు సంబంధించిన విషయాలపై పరిశీలన చేయనున్నారు.జీవన ఎరువులను రైతులకు రాయితీ ధరలకు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు ఎస్వీ పశువైద్య కళాశాలలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొని రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు.సాయంత్రం 5గంటలకు తిరుపతి రూరల్ మండలం వేమూరు గ్రామంలో రైతులు చేపడుతున్న సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్‌ను పరిశీలిస్తారు. అదేవిధంగా వేమూరు గ్రామంలోని అరటి, దానిమ్మ పంటలను పరిశీలించనున్నారు. ఆ తరువాత మిట్టమీద కండ్రిగ వద్దకు చేరుకుని రైతులు సాగు చేస్తున్న పంట పొలాలను సందర్శించి పాడి రైతులకు రాయితీ దాణాను పంపిణీ చేస్తారు. అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ నిర్మల్ నిత్యానంద్, పశుసంవర్థక శాఖ జేడీ శ్రీనివాసరావులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాలేజీ క్రీడామైదానంలో జరిగే బహిరంగ సభ వద్ద స్టాల్స్‌ను, రాయితీతో అందించే వ్యవసాయ పని ముట్లను ఇప్పటికే సిద్ధం చేసిపెట్టారు.