నేడు తిరుమలలో తరిగొండ వెంగమాంబ జయంతి

సాయంత్రం నృసింహ జయంతి కార్యక్రమాలు
తిరుమల,ఏప్రిల్‌27(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపరభక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతిని ఏప్రిల్‌ 28వ తేదీన తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి పరిణయమండపానికి వేంచేపు చేస్తారు. రాత్రి 8 గంటల వరకు అక్కడ వెంగమాంబ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. అలాగే శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో నృసింహ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో ఈ ఉత్సవం చేపడతారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత శ్రీ యోగ నరసింహస్వామివారికి
అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు. ఇదిలావుంటే శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మ¬త్సవం గురువారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర పెండ్లి వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. నాదస్వరం కళాకారులు నీలాంబరి, భూపాల, మధ్యమావతి తదితర రాగాలను పలికించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య కీర్తనలు వినిపించారు.
ఈ వేడుక ముగిసిన తరువాత స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేస్తారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్ర¬్మత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యకమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తాజావార్తలు