నేషనల్ హైవే భూసేకరణలో రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు నష్టపరిహారం అందించాలి

– 90 శాతం తమ భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ. 50 లక్షలు చెల్లించాలి – ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కారీ సీఎం కేసీఆర్ లకు మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు వినతి

జనంసాక్షి, మంథని : మంచిర్యాల నుండి వరంగల్ వరకు నిర్మించ తలపెట్టిన శంకుస్థాపన చేయబోతున్న నేషనల్ హైవే కు భూసేకరణ కోసం మంథని నియోజకవర్గంలోని పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన గ్రామాలలో ప్రభుత్వం ప్రతిపాదించిన రేటు కాకుండా రైతులకు న్యాయం చేసే విధంగా ఎకరానికి రూ. 25 లక్షలు, బోరు బావులకు రూ. 10 లక్షలు, పైప్ లైన్లకు నాలుగు లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని కోరుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, దేశ రోడ్డు రవాణా ,రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి మెయిల్ ద్వారా వినతిపత్రం అందజేసినట్లు మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ మంథని నియోజకవర్గ ప్రాంతాలైన ఒడేడు, అడవిశ్రీరాంపూర్, ముత్తారం, సర్వారం,కాజిపల్లి ,లక్కారం,మచ్చపేట, నవాబ్ పేట, బేగంపేట, ఆదివారంపేట,రాజాపూర్, రామయ్యపల్లి, పుట్టపాక, నగరంపల్లి, కన్నాల, వేంపాడు, పందులపల్లి, నాగారం ఇతర గ్రామాలు రైతులకు ఎకరానికి 25 లక్షలు నష్టపరిహారం అందించాలని, బోరు బావి కి 10 లక్షలు, పైపులైన్ కోల్పోయిన వారికి 4 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం రోడ్డు కోసం సేకరించే భూమి నాణ్యమైన సారవంతమైన వ్యవసాయ భూమి. రెండు పంటలు పండు ఇటువంటి భూమి పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలుగా ఉన్నటువంటి రైతులు ఈ రోడ్డు నిర్మాణం వల్ల రోడ్లపై పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం భూసేకరణ కోసం ఇచ్చినటువంటి ప్రాధమిక నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా డ్రై లాండ్ కాదు.. ఈ భూసేకరణ వల్ల చాలా కుటుంబాల వారికి ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో 90 శాతం భూములు కోల్పోతున్నారని, అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుండి నష్ట పరిహారం ఎకరానికి 50 లక్షలు ఇవ్వాలని కోరారు. నేషనల్ హైవే రోడ్డు సంబందించిన అభివృద్ధిని అడ్డుకోవాలని తమ ప్రాంత రైతుల ఉద్దేశం కాదు కాని తీవ్రంగా నష్టపోతున్న రైతులకు మీరిచ్చే నష్టపరిహారం ఏమాత్రం సరిపోలేనిది అని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన భూ విలువకి స్థానికంగా ఉండేటువంటి భూ విలువకి అంతరం చాలా ఉందని, కేవలం ప్రభుత్వం నిర్ణయించిన భూ విలువ మీదనే మీరు నష్టపరిహారం చెల్లిస్తే అది పూర్తిగా రైతుని దోచుకోవడమే అవుతుందన్నారు. రైతు ఎంత భూమిని కోల్పోతున్నాడో లేదా అదే విలువ కలిగినటు వంటి భూమిని మరొకచోట ఇప్పించాలని , ప్రోహిబిటేడ్ ల్యాండ్ క్రింద ఉన్న అన్ని భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. రైతుల వ్యవసాయ భూములే కాకుండా లక్షలు వెచ్చించి తవ్వుకున్న వ్యవసాయ బావులు, బోర్లు వాటికి అనుసంధానంగా వేసుకున్న పైపులైన్లు నష్టపోతున్నారని, వీటిని మళ్ళి పున:ర్నిర్మానం చేయాలంటే చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది.. వాటికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

తాజావార్తలు