నోట్లరద్దు విషయం బాబు కి తెలుసు
కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంపై వైసీపీ అధినేత జగన్ సందేహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఉదయం జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోట్లరద్దు నిర్ణయాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట నిజమేనా అని ప్రశ్నించారు. నిజంగా ఎవరికీ తెలియకుండా నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు లాంటి వాళ్లకు ముందే ఎలా తెలిసిందని జగన్ నిలదీశారు. టీడీపీకి చెందిన వాళ్లు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారని, వెంకయ్యనాయుడుగారు అయితే టీడీపీ కండువా కప్పుకుని బీజేపీలో మంత్రిగా ఉన్నారని, వాళ్ల వల్లే చంద్రబాబుకు ముందే లీక్ అయిందని జగన్ ఆరోపించారు.‘‘అక్టోబర్ 12న చంద్రబాబుగారు లేఖ రాశారు. అసలు ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఎందుకు తడుతుంది? రూ.500, 1000 నోట్లను రద్దు చేయాలని లేఖ రాయాలనే ఆలోచన నాకైతే తట్టలేదు. సామాన్యులకు ఎవరికీ ఇలాంటి ఆలోచన తట్టదు. కానీ చంద్రబాబునాయుడుగారికి తట్టింది. ఎందుకు తట్టింది?.. ఎలాగో సమాచారం ముందే తెలిసింది కాబట్టి, అది ఎలాగో జరగబోతోంది కాబట్టి.. ఒకవైపున ఆయన చక్కబెట్టుకునేవన్నీ చక్కబెట్టుకుంటున్నాడు.. మరోవైపున అది జరిగినప్పుడు ఆ క్రెడిట్ నేనే తీసుకోవచ్చు కదా అన్న ఆలోచనతో లేఖ రాశారు. అని జగన్ ప్రశ్నించారు.