నోట్ల రద్దుతో జగన్ కు వణుకు
పెద్దనోట్ల రద్దుతో ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డికి వణుకుపుట్టిందని, దాచుకున్న డబ్బంతా ఏం చేయాలో తెలియక పిచ్చిపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం కడప నగరం, రాజంపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్ అధికారంలోకి రావడం కలేనన్నారు. ప్రజల్లో తమకు మంచి పేరు వస్తుంటే విపక్ష నేత ఓర్వలేక ప్రాంతాలవారీగా పర్యటిస్తూ తన తండ్రి హయాంలో స్థాపించిన, మొదలుపెట్టిన పనులపై రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు చేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చివరకు కులాలు, మతాల పేర చిచ్చుపెట్టి ప్రజల్లో అశాంతి కలిగించాలని ప్రయత్నించారని, అయితే ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయనీ అన్నారు. వైఎస్ కుటుంబం హయాంలో ఏనాడైనా పులివెందులకు చుక్కనీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. జలయజ్ఞం పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ధన యజ్ఞంగా మార్చుకున్నారని ఆరోపించారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని, తమను ఎవ్వరూ గుర్తించడం లేదని ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యేలు శుక్రవారం తనను కలిసి మొరపెట్టుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు.