పక్షిగూడు .. ఎంత బాగుంది చూడు – ఆదర్శంగా తీసుకుని జీవనం సాగించి చూడు

జుక్కల్‌, జూలై 12 (జనంసాక్షి) రోజు రోజుకు టెక్నాలజీ వెర్రితలలు వేస్తున్న తరుణంలో మానవునికి ఓర్పు, సహనం, శాంతి, నెమ్మది సన్నగిల్లుతుంది. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అవసరం ఉండగా మనిషి అత్యాశకు పోయి తనకున్న కూడు, గూడు, గుడ్డను పక్కన పెట్టి అనర్దాలను కొనితెచ్చుకోవడమే కాకుండా మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య, హత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. పక్షులకు మెదడు ఉన్నప్పటికి ఆలోచనా శక్తి లేకపోయినా గూడు నిర్మాణానికి దూర ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్క గడ్డిపరకను పోగు చేసుకుని ఎంతో ఓపికతో ఎన్నో రోజులు కష్టపడి, ఎంతో ఓపికగా గూటిని నిర్మించుకుంటుంది. ఆ గూటిలోనే జీవనం సాగించడమే కాకుండా సంతానోత్పత్తి చేసుకుని తన పిల్లలను సంరక్షించుకునేందుకు విత్తు విత్తు కరుచుకుని వచ్చి తమ పిల్లల కడుపు నింపడమే కాకుండా తమ గూడు, తమ పిల్లలు ఇతర వ్యక్తులు, పక్షుల బారిన పడకుండా రక్షించుకుంటూ ఎండ, వాన, చలిని తట్టుకుని జీవనం కొనసాగిస్తుంది. ప్రస్థుత తరుణంలో మానవునికి మెదడుతో పాటు, ఆలోచనా శక్తి, కష్టపడే తత్వం, ఓపిక, సహనం ఉన్నప్పటికి వాటన్నింటిని పక్కన పెట్టి ద్వేశం, పగతో రగిలిపోతున్నాడు. పక్షిలో ఉన్న లక్షణాలను అవలంబిస్తే ఈరోజు మనిషి జీవితం సైతం సుఖసంతోషమయం అవుతుంది. జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ కాలువల పక్కన పక్షి గూళ్ళు దర్శనం ఇచ్చాయి. వానాకాలం సీజన్‌లో కనిపించే పక్షుల గూళ్ళు అందంగా కనిపించడమే కాకుండా మానవునికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా పక్షిగూడు, పక్షిని ఆదర్శంగా తీసుకుని ప్రస్థుత తరుణంలో ముందుకు సాగి ఉన్నదాంట్లో సర్దుకుని అత్యాశకు లోనుకాకుండా ప్రశాంత జీవితం గడిపే అలవాటు మనందరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజావార్తలు