పడకేసిన పారిశుధ్యం
బిచ్కుంద జులై 12 (జనంసాక్షి) బిచ్కుంద మండలంలోని
గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధం పడకేసింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో అప్పుడప్పుడు ప్రధాన రహదారుల్ని శుభ్రం చేస్తున్నా, ఆ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో దిక్కూదివాణం లేకుండా పోయింది. కొన్ని చోట్ల మేజర్ పంచాయతీల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు నిర్లక్ష్య వైఖరి కారణంగా రోడ్లు చెత్తాచెదారంతో నిండిపోయి ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మైనర్ పంచాయతీల్లో రోడ్లు ఊడ్చే వారే లేకుండా పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు తమ ఇళ్ల ముందు శుభ్రం చేసుకుని ఆ చెత్తను రోడ్లపైకి తెచ్చి పడేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల పాలిథిన్ కవర్లలో చుట్టి విసిరేస్తున్నారు. దీంతో రోడ్లతో పాటు పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, దుకాణాలు, నివాసాల వద్దకు గాలికి కొట్టుకు వచ్చి పేరుకుపోతోంది. ఇటీవల మండలకేంద్రంలోని విద్యా వనరుల కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి చెత్తాచెదారంతో నిండిపోయి గాలికి అటూ ఇటూ ఎగిరి పోతూ వాహనదారులు, పాదచారులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.