పనిమంతులకు పరీక్షలు
(ఏలూరుబడి పిల్లలకే కాదు.. ఇకపై ఎమ్మెల్యేలకు నెలవారీ, లేదా మూడు మాసాలకు ఒకసారి అసలు సిసలు పరీక్ష తప్పేటట్టు లేదు. ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరును సర్వే రూపంలో సేకరించి మైనస్ మార్కులను తగ్గించుకునే క్రమంలో తెలుగుదేశం సరికొత్త ప్రయోగం చేస్తోంది. ఇంతకుముందే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే పనితీరును అంచనా కట్టినప్పుడు రాష్ట్రస్థాయిలోనే మన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తొలి ఆరు ర్యాం కులు దక్కించుకున్నారు. సహజంగానే ఇది మిగతా జిల్లాలపై ప్రభావం చూపింది. గోదా వరి జిల్లాలకంటే మేం తక్కువా అనే రీతిలో మిగతా జిల్లాల్లో ఎమ్మెల్యేల మధ్య పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇకముందు విడతల వారీగా సర్వేలు కొనసాగబోతున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, సరికొత్త విధానాలు, సత్వర ప్రతిస్పందన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే జిల్లాలో ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమ పదవి ఒక హోదాగా కాకుండా ఒక బాధ్యతగా నిత్యం ఏదొక వినూత్న విధానాన్ని నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టేందుకు పోటీ పడుతున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే వంద రోజుల కార్యక్రమాన్ని ప్రకటించి ఈ స్వల్ప వ్యవధిలోనే నేరుగా ఇంటింటికి మరుగుదొడ్డి, సంపూర్ణ పారిశుధ్యానికి తొలి అడుగు వేశారు. ఉండి ఎమ్మెల్యే శివరామరాజు తన నియోజకవర్గ పరిధిలోని రైతులను ఆదుకునేందుకు స్వల్ప వ్యవధిలోనే కాల్వల్లో తూడు, కాడ తొలగించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్థానిక సమస్యలను సకాలంలో చక్కదిద్దడం ద్వారానే దెందులూరులో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలు సజావుగా కృష్ణకు చేరేందుకు వీలుగా భూసేకరణకు రైతులను ఒప్పించడం ద్వారా ప్రభుత్వ మన్నననలు అందుకోగలిగారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి నగరంలో సరికొత్త మినీ టౌన్‌షిప్‌కు తెరలేపారు. ఇలా ఎవరంతట వారు ఏదొక కార్యక్రమాన్ని ముందుకు తేవడం, నిత్యం జనంతో కలిసి ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవడం ద్వారా ఇప్పటికే మెరుగైన మార్కులు పొందారు. ఇక రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జవహర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, మొడియం శ్రీనివాసరావు సైతం తమదైన శైలిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా పాలు పంచుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని ముందుకు సాగుతున్నా గడిచిన సర్వే నివేదికల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వెనుకబడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా ఉండే గోపాలపురం, కొవ్వూరు, పోలవరంలలో ఏకపెట్టున ఒకేసారి అన్నీ అమలు చేయడం అంతసులువైన పనికాదు. ఈసారి మిగతా నియోజకవర్గాల్లో తమ సహచర ఎమ్మెల్యేలతో సమానంగా మరింత ప్రోగ్రెస్ మార్కులు పొందాలని వీరంతా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఏదొక రూపంలో సర్వేలు సహజం. ఈసారి ఎమ్మెల్యేల పనితీరు మీదే నేరుగా సర్వేలకు దిగడం, వీటిని బహిర్గత పర్చడంతో కొందరు ఎమ్మెల్యేలు నొచ్చుకుంటున్నారు. దీనిని కూడా పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా తప్పొప్పులు సవరించుకునేందుకు, భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేజిక్కించుకోవడానికే ఇలా తాపత్రయ పడాల్సి వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయినప్పటికి ఈసారి సర్వే ముగిసేనాటికి తమ పనితీరు మరింత వేగంగా మార్చుకోవాలని మరికొందరు ఎమ్మెల్యేలు నిశ్చయంతో ఉన్నారు. కొన్నిపథకాల అమలు తీరులో అడ్డంకులు ఏర్పడుతున్నాయని, వీటిని సవరించకముందే తమ జాతకాలను కరాఖండీగా తేల్చి వేయడాన్ని ఇంకొందరు తప్పుపడుతున్నారు. ఏమైనప్పటికి ఇక వరుసగా ఎమ్మెల్యేలకు సర్వే పరీక్ష మాత్రం తప్పదు.