పసికందు మృతి కారకులపై క్రిమినల్ కేసు నమోదు

rc6300jtగుంటూరు, ఆగస్టు 28 : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పసికందు మృతికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వాస్పత్రిలో మౌలికసదుపాయాలు కల్పించడంలో వైద్యుల నిర్లక్ష్యంతో పాటు, వైద్య సిబ్బంది కొరత, జీజీహెచ్‌లో రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రుల బృందం నిర్ణయించుకుంది.
ఘటన జరిగిన వెంటనే మంత్రి కామినేని శ్రీనివాస్ అక్కడకు చేరుకుని పరిస్థిని సమీక్షించారు. ఘటన మొత్తంపై కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ కమిటీ వేయగా, ప్రొఫెసర్ సుబ్బారావు ఆధ్వర్యంలో వైద్య కమిటీని వేశారు. అలాగే కొత్తపేట సీఐ వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో పోలీసు కమిటీని వేశారు. పూర్తి విచారణ జరిపి ఈమూడు కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.
ఘటనపై క్రిమినల్ కేసును నమోదు చేసినట్లు కొత్తపేట సీఐ వెంకన్న తెలిపారు. అయితే ఇందులో ఎవరిని బాధ్యులను చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు జీజీహెచ్ ప్రక్షాళన వైపు ప్రభుత్వం దృష్టి సారించింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగా కలెక్టర్, సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రావుతో కలిసి ఆస్పత్రిని స్వయంగా పరిశీలించారు.
ప్రభుత్వాస్పత్రిలో వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం కోసం ఎంపీ గల్లా జయదేవ్ ఆస్పత్రిలోని వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పసికందు మృతి అనంతరం మున్సిపల్ కార్మికులతో జీజీహెచ్‌లో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఎలుకలు, పందికొక్కుల నివారణకు పశసంవర్ధక, వ్యవసాయశాఖల సహాయాన్ని అధికారులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

తాజావార్తలు