పాదయాత్ర పేరుతో కేసులనుంచి తప్పించుకునే ప్రయత్నం: టిడిపి

విజయవాడ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): పాదయాత్ర పేరుతో కేసుల నుంచి తప్పించుకోవాలని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చూస్తున్నారని ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పంచుమర్తి అనురాధ అన్నారు. జగన్‌ తప్పులవిూద తప్పులు చేస్తున్నారని, వ్యాపారం చేసినా రాజకీయం చేసినా జగన్‌ది తప్పుడు దారేనని అనురాధ అన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ… , ప్రజా సమస్యలపై చర్చకు వేదికైన అసెంబ్లీకి రానంటున్న జగన్‌.. పాదయత్రకి ఎలా వెళతారని ఆమె పేర్కొన్నారు. అలాగే పాదయాత్ర పేరుతో విధ్వంసాలు సృష్టిస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరని అన్నారు. ఇకపోతే జగన్‌ పద్ధతి నచ్చక సగం మంది ప్రతినిధులు పార్టీ నుంచి బయటకు వచ్చేశారని ఆమె పేర్కొన్నారు. జగన్‌ తీరు ఇలాగే ఉంటే మిగతావారు కూడా దారి చూసుకుంటారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ,కార్యక్రమాలను బలపర్చడం చేయకున్నా కనీసం సద్విమర్శలు చేయాలన్నారు. మొత్తంగా ప్రభుత్వం ఏవిూ చేయడం లేదన్న విపరీత ధోరణిలో జగన్‌ ఉన్నారని ఆమె అన్నారు. ఇలాంటి విపక్షం గతంలో ఎప్పుడూ లేదన్నారు.

పొర్లు దండాలు పెట్టినా ఫలితం ఉండదు: మంత్రి

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర కాదు… పొర్లు దండాలు పెట్టినా ఫలితం ఉండబోదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానంతోపాటు రాష్ట్రంలోని 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్నారు. అలాగే జగన్‌ అద్దె మైక్‌లు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయంటూ వైసీపీ నేతలనుద్దేశించి అన్నారు. 12 కేసులు ఉన్న వ్యక్తి దేశంలో ఎక్కడా పార్టీ అధ్యక్షుడిగా లేరని, దీని వల్ల క్రిమినల్స్‌, ముద్దాయిలు కూడా రాజకీయాల్లోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. యువతపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ఇప్పటికైనా ఆలోచించాలని హితవు పలికారు. పాదయాత్రకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం కూడా ఆయనకో గుణపాఠమని మంత్రి వ్యాఖ్యానించారు.

 

తాజావార్తలు