పార్నెల్‌కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మద్దతు
డ్రగ్స్ వివాదంలో ఇప్పుడే చర్యలు తీసుకోలేమన్న సీఎస్‌ఏ
జోహెనస్‌బర్గ్, ఆగస్టు 2: ఐపీఎల్ సందర్భంగా భారత్‌లో డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న తమ క్రికెటర్ వేన్ పార్నెల్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మద్దతుగా నిలిచింది. అతనిపై ఇప్పటికిప్పుడే చర్యలు తీసుకోలేమని, వివాదానికి సంబంధించి విచారణ, రిపోర్టులు భారత్‌లోనే ఉన్నాయని క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ ఫాల్ అన్నారు. ముంబై పోలీసుల విచారణలో లోపాలున్నాయని ఆయను వ్యాఖ్యనించారు. పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపిన తర్వాతే ఫలితం ప్రకటించాలని సూచించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ జరుగుతోన్న సమయంలో పుణే వారియర్స్ తరపెన ఆడుతోన్న వేన్ పార్నల్, భారత క్రికెటర్ రాహుల్‌శర్మ ఒక రేవ్‌పార్టీకి హాజరయ్యారు. ముంబై శివార్లలోని ఒక హోటల్‌లో వీరితో పాటు అక్కడ మరో 100మందికి పైగా పార్టీ చేసుకుంటున్నారు. అయితే పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం రావడంలో ముంబై పోలీసులు జూహులోని వోక్‌వుడ్స్ హోటల్‌పై దాడిచేశారు. పార్టీని మధ్యలోనే ఆపించి తనిఖీలు నిర్వహించారు. అయితే తము కేవలం బర్త్‌డే పార్టీకి మాత్రమే వచ్చామని, తాము వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరని రాహుల్‌శర్మ అన్నాడు. పోలీసులు మాత్రం ఇద్దరు ఆటగాళ్ళను మెడికల్ టెస్టులకు పంపించారు. ఈ దాడిలో పోలీసులు 110 గ్రాముల కొకైన్‌తో పాటు నిషేదిత ఉత్ప్రేరకాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారిపై నార్కోటిక్ డ్రగ్ సైకోట్రాపిక్ సబ్‌స్టెన్సిన్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇటీవలే ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్స్ వెలుగుచూశాయి. దానిలో ఇద్దరు ఆటగాళ్ళు డ్రగ్స్ వాడినట్టే తేలిందని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్‌శర్మను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చినా పూర్తిగా రిపోర్టును పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. అటు దక్షిణాఫ్రికా క్రికెటర్ పార్నెల్‌పైనా ముంబై పోలీసులు కేసు నమోదు చేయడంతో అతని ప్లేస్‌పై సందిగ్థత నెలకొంది. అయితే క్రికెట్ సౌతాఫ్రికా మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. భారత్‌లో జరిగిన విచారణను తాము నమ్మలేమని, అలాంటప్పుడు ఎలా చర్యలు తీసుకుంటామని బోర్డు ప్రశ్నించింది.