పిడుగు ప్రాంతాలకు ముందస్తు సమాచారం
అధికారులను హెచ్చరించిన బాబు
నీరు ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్
అమరావతి,మే14(జనంసాక్షి): వాతావరణంలో అనూహ్య మార్పులతో ఎపి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పిడుగులతో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు జారీ చేశారు. పిడుగుల సమాచారం గ్రామాలకు, ప్రజలకు ముందే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగుల సమాచారం ముందే ఇస్తున్నా ఇంకా మరణాలు సంభవిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమాచారన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ఆయా గ్రామాలకు చేరవేయానల్నారు. పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతి చెందిన ఘటనలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అటు నీరు ప్రగతి, వ్యవసాయంపైనా సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ పనులు లేవు కాబట్టి ఉపాధి పనులు ముమ్మరం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యేలోపు నరేగా పనులు గరిష్టంగా చేపట్టాలన్నారు. ఈ నెలలోనే రూ.1,000కోట్లు విలువైన నరేగా పనులు చేయాలని సూచించారు. రోజువారీ కూలీల హాజరు 23లక్షలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. 525గ్రామాల్లో తాగునీటి రవాణా జరుగుతోందని.. ఈ గ్రామాల్లో తాగునీటి పథకాల పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. గిరిజన తండాల్లో రూ.105కోట్లతో 1,017పనులు వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 531 పనులు త్వరితగతిన చేపట్టాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాలలో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. మరో 8వేల మరుగుదొడ్లు నిర్మిస్తే రాష్ట్రంలో 100 శాతం ఓడిఎఫ్ పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖలోనూ మరుగుదొడ్ల నిర్మాణం వేగం పుంజుకోవాలని.. ఓడీఎఫ్ ప్లస్ పనులకు అన్నిజిల్లాలు సంసిద్ధం కావాలన్నారు. రూ.900కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కేంద్రంతో విభేదించినా తమిళనాడు, కేరళ అభివృద్ధిలో ఉన్నాయని.. వాటి బాటలోనే మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలని చంద్రబాబు అధికారులతో అన్నారు. ప్రాథమిక విద్యలో మూడో స్థానంలో ఉన్నామని, ఐఐటీలో 12శాతం ఫలితాలు ఏపివేనని గుర్తుచేశారు. దేశంలోనే విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ నంబర్‌వన్ కావాలన్నారు. పదేళ్ళలో దేశంలో పేదరికం 51శాతంనుంచి 21శాతంకు చేరిందన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలలో పేదరికం స్థాయి 9శాతం వచ్చిందని.. కేరళలో పేదరికం 1శాతం తమిళనాడులో 6శాతం , కర్ణాటకలో 11శాతం, తెలంగాణలో 12శాతం, ఆంధప్రదేశ్‌లో 13శాతం ఉందని తెలిపారు.