పీపుల్ చాయిస్ : సచిన్ పేరును ప్రతిపాదించిన ఐసీసీ
పీపుల్ చాయిస్ అవార్డుకు మరోమారు మ్లాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరును అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిపాదించింది. ఈ అవార్డుకు సచిన్‌తో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమారం సంగక్కరా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫిలాండర్, జాక్వస్ కలిస్, ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ పేర్లను కూడా నామినేట్ చేసినట్లు ఐసీసీ పేర్కొంది. కాగా ఇప్పటికే 2011లో సంగక్కరా, 2010లో సచిన్‌లు ఈ అవార్డులు అందుకొన్నారు. తాజాగా వారి పేర్లను మరోమారు ఐసీసీ 2012 అవార్డుకు నామినేట్ చేసింది. వీరిని ఈ అవార్డుకు క్రికెట్ అభిమానులే ఎంపిక చేయాల్సి ఉంటుందని ఐసీసీ అధికార ప్రతినిధులు వివరణ ఇస్తున్నారు. ఈ ప్రతిపాదించిన వారికి అవార్డు విజేత కోసం ఫేస్‌బుక్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తామని ఇందులో క్రికెట్ అభిమానులు పాల్గొని తమకు నచ్చిన ఓటు వేయాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఈ ఓటింగ్ విధానాన్ని జూలై 31నుంచి సెప్టెంబర్ 15 వరకు అభిమానులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వారు పేర్కొన్నారు. సెప్టెంబర్ 15న కొలంబోలో జరుగనున్న ఎల్‌జి ఐసీసీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారనీ ఐసీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.