పేద బిడ్డల చదువు ఆర్థికబారం కావద్దన్నదే మా ఆలోచన – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌


జనంసాక్షి, మంథని : పేదింటి బిడ్డల చదువులు తల్లిదండ్రులకు ఆర్థికబారం కావద్దన్నదే మా ఆలోచన అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువు కుంటున్న విద్యార్ధులకు పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా బస్సు పాస్‌లను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది పేద బిడ్డలు ఆర్థిక స్థోమత లేక చదువులకు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవాలనే తపన, ఆరాటం, ఆకాంక్ష ఉన్నా ఆర్థిక పరిస్థితులు వారి భవిష్యత్‌కు అడ్డు పడుతున్నాయని, అలాంటి పరిస్థితులు ఏ బిడ్డికు రావద్దన్నది ఆలోచన చేస్తున్నామని, ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే పేద బిడ్డల ఆకలి తీర్చేలా మధ్యాహ్న బోజనం, ట్యూషన్‌ ఫీజు ఇతరత్రా సేవలు అందించామని ఆయన గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకుని ఆకాశమే హద్దుగా ఎదుగాలన్నదే తమ ఆకాంక్ష అని, ఈ క్రమంలో రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువుకునే పేద విద్యార్ధులకు హస్టల్‌ వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనంతరం విద్యార్దులకు ఉచిత బస్‌పాస్‌లను ఆయన అందజేశారు.

తాజావార్తలు