పోరాటాలతో మోడీ మెడలు వంచుతాం
అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం
వైకాపాది దొంగ పోరాటమన్న సిఎం రమేశ్
కడప,ఏప్రిల్20(జనంసాక్షి): పోరాటాలతో మోదీ ప్రభుత్వం మెడలు వంచుతామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. విభజన హావిూలు అమలు చేయడంలో మోడీ సర్కార్ అవలంబిస్తున్న తీరుకు నిరసనగానే టిడిపి ధర్మదీక్షకు దిగిందని అన్నారు. కడపలో జరిగిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ పోరాటాలతో మోదీ దిగిరాకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మోదీతో జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీది దొంగ పోరాటమని ప్రజలకు తెలుసని సీఎం రమేష్ అన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిలో తాను ఒకడిగా చంద్రబాబు పోరాటం చేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ హావిూల వర్షం కురిపించిందని గుర్తుచేశారు. నాలుగేళ్లు అవుతున్నా ఒక్క హావిూని అమలుచేయకుండా ప్రజలను కేంద్రం మోసగించిందని ఆరోపించారు. పోరాటాలు, ఉద్యమాల ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.ఆంధ్రుల సత్తాను కేంద్రానికి చూపించే సమయం వచ్చిందని, కులమతాలు, పార్టీలకతీతంగా అందరూ కలసి కట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమాలను ఎవరు ప్రజల కోసం చేస్తున్నారు, ఎవరు కేసుల కోసం చేస్తున్నారు? ప్రజలు గమనించాలన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు నష్టం, అన్యాయం జరుగుతుండటంతో చూడలేక సిఎం చంద్రబాబు ధర్మదీక్షకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. ఆంధప్రదేశ్‌కు చేసిన అన్యాయంపై విదేశాలలో ప్రధానికి నిరసన వ్యక్తమవుతున్నదని
చెప్పారు.