పోలవరం అవకతవకలపై సిబిఐ విచారణ: కన్నబాబు డిమాండ్
కాకినాడ,సెప్టెంబర్7(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. పోలవరాన్ని కేంద్రం నుంచి చంద్రబాబు తన చేతుల్లోకి లాక్కున్నారని, కవిూషన్లు దండుకోవడానికే ఈ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లో పెట్టుకున్నారన్నారు. అంచనా వ్యయాన్ని రూ.16వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లకు పెంచారని, పునరావాస ప్యాకేజీని సక్రమంగా అమలు చేయకుండా బాధితులను రోడ్డున పడేశారన్నారు. అయితే 2018 మార్చికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, గ్రాఫిక్స్‌తో అమరావతిని కట్టినట్లే…పోలవరాన్ని కూడా పూర్తి చేస్తారా అంటూ కన్నబాబు ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. 2018కల్లా పోలవరం పూర్తి చేస్తే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎందుకన్నారు. అవకతవకలు బయటపడతాయనే భయంతోనే.. ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్ట్‌ను చంద్రబాబు రద్దు చేస్తున్నారని, కాంట్రాక్ట్‌ను రద్దు చేసినంత మాత్రాన చేసిన తప్పులు మాసిపోవని కన్నబాబు ధ్వజమెత్తారు.