పోలవరం కోసం రాజకీయాలు తగవు: టిడిపి

కాకినాడ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రాష్టాన్రికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సాధించుకోవడానికి పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేయాలని జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ నామాన రాంబాబు అన్నారు. ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ప్రజలు సహించరని అన్నారు. ముఖ్యంగా బిజెపి నేతలు విమర్శలు మాని ప్రాజెక్ట్‌ పూర్తయ్యేలా చూడాలని అన్నారు. లేకుంటే రాష్ట్ర ప్రజానీకం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని నామాన రాంబాబు అన్నారు. పోలవరం నిర్మాణం కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, ఇప్పటి వరకు 19 సార్లు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారని, 42 సార్లు వర్చువల్‌ పరిశీలన చేశారని చెప్పారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం కోరితే అప్పగిస్తామని మాత్రమే చంద్రబాబు చెప్పారన్నారు. అయితే ఉండవల్లి అరుణ్‌కుమార్‌, వైవీ సుబ్బారెడ్డి వంటివారు ఈ అంశంపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, స్పిల్‌ ఛాంబర్‌, కాఫర్‌డ్యామ్‌ల నిర్మాణాలను నిలుపుదల చేయాలని కేంద్రం లేఖ రాయడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్న దశలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. అర్హతలేనివారి మాటలకు విలువ ఉండదన్నారు. అడ్డగోలు విభజనతో నష్టపోయిన రాష్టాన్న్రి ప్రగతి పథకంలో నిలపడానికి చంద్రబాబు కృషి చేస్తుంటే కొందరు స్వార్థపూరితంగా ఆయనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన హయాంలో ప్రాజెక్టు పూర్తికాకుంటే మరెవ్వరితోనూ సాధ్యంకాదన్నారు.

తాజావార్తలు