పోలవరం జిల్లాకు జీవనాడి: బాపిరాజు
ఏలూరు,నవంబర్30(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టుతో జిల్లా మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నిర్మాణాలు పూర్తయితే అన్నదాతలకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. మహిళల ఆర్థిక బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు ముందజంలో ఉంచుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను రెండు విడతల్లో రుణ మాఫీ చేశారన్నారు. చాలాచోట్ల ఇళ్ల సమస్యలు ఉన్నాయని, గత ప్రభుత్వ తప్పిదాలతో బిల్లుల అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం రానున్న రెండున్నరేళ్లలో ఇళ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెదేపా కృషి చేస్తుందన్నారు. మౌలిక వసతుల కల్పనకు పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రాష్టాన్న్రి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచడానికి సీఎం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెదేపాదన్నారు. ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న 8 గ్రామాలకు పునరావాస కల్పన పూర్తి చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. పోలవరం మండలం దేవరగొంది, మామిడిగొంది, తోటగొంది, రామన్నపాలెం, చేగొండపల్లి, పైడిపాక, రామయ్యపేట, సింగన్నపల్లి గ్రామాల వారికి పునరావాసం కల్పించామని పేర్కొన్నారు.