పోలవరం వల్ల భద్రాచలంకి ముప్పు లేదు

 పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణంతోపాటు అన్ని అనుమతులు లభించాయని కేంద్ర నీటిపారుదల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బాలయన్ తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సభ్యుడు సీతారాం నాయక్ అడిగిన అనుబంధ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విpolavaram-project-25pol1-copyషయం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలంలోని రామాలయం ముంపునకు గురవుతుందనే విషయం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతున్నందున ఇప్పుడు ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు చేయలేమని సంజీవ్ స్పష్టం చేశారు. తెలంగాణాలోని పలు మండలాలను ముంపునకు గురి చేస్తూ వేలాది గిరిజనులను నిర్వాసితులుగా మారుస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించటం వలన తన నియోజకవర్గంలోని ఏడు మండలాలు ముంపునకు గురవుతాయని, వేలాది గిరిజనులు తమ సర్వస్వం కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం దేవాలయం కూడా ముంపునకు గురవుతుందన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా లేదన్నారు. నిర్వాసితులకు పదమూడవ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా ఎంపి బలభద్ర మాఝీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఒడిశా, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నా నిర్మాణాన్ని కొనసాగించటం అన్యాయమని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం పనులు ఏమేరకు పూర్తయిందనే ప్రశ్నకు మంత్రి ఎందుకు సమాధానం ఇవ్వటం లేదని ఆయన నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించే బదులు మూడు బ్యారేజీలు నిర్మించటం మంచిదంటూ సీనియర్ ఇంజనీర్ హనుమంతరావు చేసిన సూచనను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని మాఝీ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును నిర్మించటం ద్వారా మూడు లక్షల మంది గిరిజనులను మీరు చంపుతున్నారని ఆయన ఆవేశంతో అన్నారు.

తాజావార్తలు